అక్టోబర్‌ 31 వరకు సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు బంద్‌

By సుభాష్  Published on  2 Oct 2020 11:11 AM GMT
అక్టోబర్‌ 31 వరకు సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు బంద్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో అన్‌లాక్‌ 5.0 కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 31 వరకు సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ ఫుల్స్‌, ప్రార్థనా మందిరాలు, ఆడిటోరియంలు, సమావేశం హాళ్లు, అలాగే విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు, యూనివర్సిటీలు, అంగన్‌వాడీలు బంద్‌ పాటించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం అనుమతి లేకుండా కంటైన్‌మెంట్‌ జోన్లు, జిల్లా స్థాయిలో ఎటువంటి లాక్‌డౌన్‌ విధించేందుకు వీలులేదని తెలిపింది.

కాగా, నవంబర్‌ 3న బాలాసోర్‌, టిర్టోల్ అసెంబ్లీ విభాగాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలకు అనుమతిస్తూ ఈసీఐ, ఒడిశా చీఫ్‌ ఎలక్టోరల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్‌, హ్యాండ్‌ శానిటైజింగ్‌ తప్పని సరి అని తెలిపింది. వంద మంది వ్యక్తుల పరిమితికి లోబడి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ సమావేశాలు అనుమతి ఉండదని తెలిపింది. అలాగే వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించకూడదని సూచించింది. ఇక సరుకు రవాణా, ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.

Next Story
Share it