తెలుగు వర్సిటీ స్థలాలను తీసుకోవడం సరికాదు

By అంజి  Published on  22 Feb 2020 9:44 AM GMT
తెలుగు వర్సిటీ స్థలాలను తీసుకోవడం సరికాదు

తూర్పుగోదావరి: సీఎం వైఎస్‌ జగన్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. రాజమండ్రిలోని తెలుగు యూనివర్సిటీని ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని లేఖలో ఆయన పేర్కొన్నారు.

మొత్తం 20 ఎకరాల భూమి ఇళ్ల స్థలాలకు ఇచ్చేయాలని ఇటీవల కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పు బట్టారు. షెడ్యూల్‌ 10లో ఉన్న తెలుగు యూనివర్సిటీని ఏపీ, తెలంగాణ ఇంకా విభజించుకోలేదన్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా తూ.గో కలెక్టర్‌ ఆదేశాలున్నాయని ఉండవల్లి అన్నారు. తక్షణమే ఆ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఉండవల్లి.. సీఎం జగన్‌కు రాసిన లేఖలో తెలిపారు.

ఇటీవలే రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు ఉండవల్లి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల క్రితం రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ ఆలోచన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి తన లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. రాజమండ్రి హైకోర్టు బెంచ్‌కు అనుకూలమని ఉండవల్లి అన్నారు. ఉండవల్లి లేఖతో.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే సీఎం జగన్‌.. ఈ రెండు లేఖలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Next Story