ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2020 12:12 PM ISTకరేబియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ టైటిల్ ను ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ లూసియా జూక్స్ పై నైట్ రైడర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ టోర్నమెంట్‌లో నైట్ రైడర్స్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడకపోవడం విశేషం.
టాస్ గెలిచిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ లూసియా 19.1 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆండ్రీ ఫ్లెచర్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మార్క్ దెయాల్ 29, ఛేజ్ 22, నజీబుల్లా 24 పరుగులతో రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో కీరన్ పొలార్డ్ 4 వికెట్లు సాధించగా.. అలీ ఖాన్, ఫవాద్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓ మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. వెబ్ స్టర్ 5 పరుగులు, సీఫర్ట్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో.. నైట్ రైడర్స్ అభిమానుల్లో కలవరం మొదలైంది. అయితే.. ఓపెనర్ లెండెల్ సిమన్స్(49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)కు జతకలిసినా.. డారెన్ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. వీరిద్దరు వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 బంతుల్లో అభేద్యంగా 138 పరుగులు జోడించారు. దీంతో.. నాలుగోసారి ట్రినిడాడ్ జట్టు సీపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. సిమన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. పొలార్డ్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.