ఆ 127 మందికి ఆధార్‌ సంస్థ నోటీసులు.. రేపే విచారణ

By అంజి  Published on  19 Feb 2020 9:52 AM GMT
ఆ 127 మందికి ఆధార్‌ సంస్థ నోటీసులు.. రేపే విచారణ

హైదరాబాద్‌లో ఆధార్‌ సంస్థ నోటీసులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా సంబంధించిన ఓ కార్యాలయం 127 మందిని నోటీసులు జారీ చేసింది. ఆ 127 మంది ఫేక్ డాక్యుమెంట్స్‌, తప్పుడు పత్రాలతో ఆధార్‌ పొందినట్లు గుర్తించింది. రేపు బాలాపూర్‌లోని మెఘా గార్డెన్‌లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరసత్వం కలిగి ఉంటే సరైన ఆధారాలు చూపించాలని తెలిపింది. ఒక వేళ విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI వెల్లడించింది. దాదాపు 1000 మంది తప్పుడు పత్రాల ద్వారా ఆధార్‌ పొందినట్లు UIDAI సంస్థ గుర్తించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొదటి 127 మందికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆధార్‌ సంస్థ నోటీసులు జారీ చేయడంతో.. ఇప్పుడు మరింత సెన్సిటివ్‌గా మారే అవకాశాలున్నాయి.

రేపు సరైన పత్రాలు సమర్పించకపోతే.. వారికున్న ఆధార్‌కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. ఒక వేళ భారతీయులు కాకపోతే చట్టబద్దంగానే దేశంలోకి ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న వ్యక్తులు మాత్రం ఇది చట్టం వ్యతిరేకమని అంటున్నారు. ఆధార్‌కార్డు జారీ సమయంలోనే అన్ని ఆధారాలు తీసుకున్నారని చెబుతున్నారు.

అయితే నోటీసులు అందుకున్న వ్యక్తులు ఆధార్‌ సంస్థ ఎదుట హాజరుకావాల్సిన అవసరం లేదని నోటీసులు అందుకున్న తరఫు న్యాయవాదులు అంటున్నారు. దీనిపై న్యాయవాదులు న్యాయపోరాటం చేస్తామంటున్నారు. సిటిజన్‌ షిప్‌ను ప్రశ్నించే అర్హత లేదంటున్నారు.

UIDAI Issues Notices

నగరంలో ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సత్తర్‌ ఖాన్‌కు ఈ నెల 3న ఆధార్‌ నోటీసులు జారీ చేసింది. తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డు పొందావని నోటీసులో పేర్కొంది. అయితే గురువారం నాడు విచారణ అధికారి ముందు హాజరు అయ్యి.. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనిన తెలిపింది. దీనికి సంబంధించిన నోటీసులు ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారన్న సమాచారం మేరకు ఈ నోటీసులు పంపినట్లు ఆధార్‌ సంస్థ చెబుతోంది. ఆధార్‌ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే భారత్‌లో 182 రోజులు నివసించాలన్న నిబందన ఉంది.

Next Story