మెట్రో రైలు ప్రారంభోత్సం.. టీఆర్‌ఎస్‌ ఫంక్షనా..?

By అంజి  Published on  15 Feb 2020 10:44 AM GMT
మెట్రో రైలు ప్రారంభోత్సం.. టీఆర్‌ఎస్‌ ఫంక్షనా..?

హైదరాబాద్‌: మెట్రో అధికారుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం దిల్‌ కుషా గెస్ట్‌ హౌస్‌లో మెట్రో అధికారులతో కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంపీ నాయుడు, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్‌ ఏకే షైనీ, హెచ్‌ఎంఎల్‌ఆర్‌ చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనంద్‌ మోహన్‌, జీఎం రాజేశ్వర్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారుల పనితీరును ఆయన తప్పుబట్టారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న తాము మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని.. కానీ దేశ ప్రధాని నరేంద్రమోదీ ఫొటో మాత్రం ఉండదని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన మెట్రో కారిడార్‌ ప్రారంభోత్సవానికి, ప్రోటోకాల్‌ ప్రకారం స్థానిక ఎంపీ అయిన తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తనకు విప్‌ ఉందని, ఆ రోజు అందరం పార్లమెంట్‌లో ఉండాలని కిషన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమానికి ఒక్కరోజు ముందు ఎలా చెప్తారంటూ నిలదీశారు.

రూ.1250 కోట్లు మెట్రోకి ఇచ్చామన్నారు... మరో రూ.200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. మెట్రో కారిడార్‌ ప్రారంభోత్సం కూడా టీఆర్‌ఎస్‌ ఫంక్షన్‌ లాగే చేస్తారంటూ అంటూ కిషన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. మెట్రో ప్రారంభోత్స సమయంలో చాలా చోట్ల హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడా కూడా పీఎం మోదీ ఫొటో లేకపోవడంపై ఆయన సీరియస్‌ అయ్యినట్లు తెలుస్తోంది. నిధుల విషయమై కేంద్రం దగ్గరకు రావద్దని.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన లక్ష్మణ్‌, రాంచందర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.

ఇటీవలే జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గంలో 11 కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో గ్రేటర్‌ నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. బీజేఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

Next Story