తన రికార్డును తానే బద్దలు కొట్టిన 'హైదరాబాద్‌ మెట్రో'

By అంజి  Published on  12 Feb 2020 3:57 AM GMT
తన రికార్డును తానే బద్దలు కొట్టిన హైదరాబాద్‌ మెట్రో

హైదరాబాద్‌ మెట్రో.. మరో రికార్డ్‌ సృష్టించింది. సోమవారం ఒక్కరోజే అన్ని కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించారు. అయితే ఇది సాధారణ రోజులను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే ఇది ఆల్‌టైమ్‌ రికార్డని మెట్రో అధికారులు తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్‌ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారు జామున 2 గంటల వరకు మెట్రో రైళ్లలో 4,60,000 మంది ప్రయాణించారు. అయితే సాధారణ రోజుల్లో కూడా 4,47,009 మంది ప్రయాణించడం ఇదే తొలిసారని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. లక్షల మంది ప్రయాణికులను మెట్రో రైళ్లు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా నగరవాసులు మెట్రో ఎక్కడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కూడా అనేక సేవలను అందిస్తోంది. దేశంలోనే హైదరాబాద్‌ మెట్రో.. రెండో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ. మెట్రో రైళ్లలో రోజుకు సగటున 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో 10 కోట్ల మందికిపైనే మెట్రోలో ప్రయాణించారు.

జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గంలో 11 కిలోమీటర్ల మేర మెట్రోను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో గ్రేటర్‌ నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. సోమవారం నాడు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గంలో 33,886 మంది ప్రయాణించారని మెట్రో అధికారులు తెలిపారు. ఒక్క ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచే 14,894 మంది ప్రయాణించారని, మరో నెల రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు.

బీజేఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గంలో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కు చేరుకోవడానికి 16 నిమిషాల సమయం పడుతుంది. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు కోనుగోలు చేస్తున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 47 వేల మందికి క్యూఆర్‌ కోడ్‌ టికెట్లు ఇచ్చామని మెట్రో అధికారులు తెలిపారు. అమీర్‌పేట, ఎల్బీనగర్‌, రాయదుర్గం, మియాపూర్‌, కెపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌ స్టేషన్‌లు అధిక రద్దీతో ఉంటున్నాయి.

Next Story