పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై స్పోర్ట్స్‌ కార్ల హల్‌ చల్‌

By అంజి  Published on  2 Feb 2020 3:23 PM IST
పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై స్పోర్ట్స్‌ కార్ల హల్‌ చల్‌

హైదరాబాద్‌లో పట్టపగలే జోరుగా కారు రేసింగ్‌ జరుగుతోంది. నగర శివారు ప్రాంతాల్లోని రోడ్లపై కొందరు పోలీసుల కన్నుగప్పి కారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై ఆదివారం ఉదయం అత్యంత ఆధునికమైన లంబోర్గిని, ఆడి కార్లు హల్‌ చల్‌ చేశాయి. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయాందోళనకు గురి చేశాయి.

శంషాబాద్‌ నుంచి మెహదీపట్నం వైపుగా రెండు స్పోర్ట్స్‌ కార్లు పోటా పోటీగా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్నవారిని హడలెత్తించారు. 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కార్లను వెంబడించి పట్టుకున్నారు. స్పోర్ట్స్‌ కార్లను అతివేగంగా డ్రైవ్‌ చేస్తున్న ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను సీజ్‌ చేసిన పోలీసులు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు కారు డ్రైవర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు కారు రేసింగ్‌ పెట్టుకొని అతి వేగంగా రెండు కార్లను డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

వీకెండ్‌లలో నగర శివారు రోడ్లపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ స్పోర్ట్స్‌ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి. ఇప్పటికే వరుసగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించడానికే పోలీసులు వాహనాల వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గించారు. అలాగే కొన్ని చోట్ల ప్రత్యేక తనిఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఇవాళ అతివేగంగా వెళ్తున్న రెండు స్పోర్ట్స్‌ కార్లను పోలీసులు పట్టుకున్నారు.

Next Story