ఠక్-ఠక్ గ్యాంగ్.. కారు మీద ఆయిల్ జల్లే వారు.. ఏమి స్వాధీనం చేసుకున్నారంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 3:51 PM GMTన్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఠక్-ఠక్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి దగ్గర నుండి దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందేర్ పురి ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల సందీప్, మదన్ గిరి ప్రాంతానికి చెందిన 20 సంవత్సరాల సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఠక్-ఠక్ గ్యాంగ్ బంగారాన్ని కొట్టేసిన ఘటన బుధవారం నాడు రాణి ఝాన్సీ రోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దేశ్ బంధు గుప్తా రోడ్ పోలీసు స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తికి పొడవాటి జుట్టు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు నిందితులను పట్టుకోడానికి తెలివిగా వలపన్నారు. అనుకున్నట్లుగానే మదన్ గిరి ప్రాంతం లోని సెంట్రల్ మార్కెట్ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు(సౌత్) అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.
సందీప్ ను గతంలో కూడా 70 లక్షల దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టేసిన బంగారం తీసుకుని ఢిల్లీ నుండి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నామని ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. ఇదే ప్లాన్ ప్రకారమే గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు.
కారు బానెట్ మీద ఆయిల్ ను జల్లడం, పొగలు, కొంచెం వాసన వచ్చేలా చేసి డ్రైవర్ కు అనుమానం కలిగించేవాళ్ళు..! డ్రైవర్ ఫుయెల్ ట్యాంక్ లీక్ అయ్యిందేమోనన్న భయంతో కిందకు దిగడం లాంటివి చేస్తే కారులో ఉన్న విలువైన వస్తువులను కొట్టేసుకుని వెళ్లిపోయారు. అలా ఇటీవలే కోటి రూపాయల విలువైన ఆభరణాలను కొట్టేసిన ఈ గ్యాంగ్ మెంబర్లు.. వాటితో ఢిల్లీ దాటి వెళ్లిపోవాలని భావించారు.. కానీ అది వీలుపడలేదు.