వివేకా హత్య కేసు ట్విస్ట్‌.. విచారణ వాయిదా

By అంజి  Published on  28 Jan 2020 9:18 AM GMT
వివేకా హత్య కేసు ట్విస్ట్‌.. విచారణ వాయిదా

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను పిటిషనర్‌ సునీత చేర్చారు. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ సీఎం వైఎస్‌ జగన్‌, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పటిషన్లు వేశారు.

కాగా విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టుకి ప్రభుత్వం తెలిపింది. అన్ని పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. మరో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందో లేదో ఫిబ్రవరి 6న తెలియనుంది. వివేకా హత్య సమయంలో సునీత సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంతో ఆ డిమాండ్‌ను పక్కన పెట్టారు. సోదరుడు సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా ఇప్పటి వరకు వివేకా హత్య కేసు పట్టించుకోకపోవడంతో సునీత హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

2019 మార్చి 14న వైఎస్‌ వివేకా అతని సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్‌ వివేకాను గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ హత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో పెను ప్రకంపనలు లేపింది. చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో ఈ హత్యజరగడంతో అధికార, విపక్షాలు హోరాహోరిగా వైఎస్‌ వివేకాను చంపింది మీరంటే, మీరంటూ తెగ ఆరోపణలు చేసుకున్నారు. చివరికి ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన జగన్‌ ప్రభుత్వం కూడా మరో సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి చాలా మంది నేతలను సిట్‌ ప్రశ్నించింది.

Next Story