టీటీడీ సీరియస్ అయ్యేంతగా యామిని సాధినేని చేసిన పనేంటి.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 7:16 AM GMT
టీటీడీ సీరియస్ అయ్యేంతగా యామిని సాధినేని చేసిన పనేంటి.?

ఏపీ బీజేపీ మహిళా నేత యామిని సాధినేనిపై కేసు నమోదైంది. అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు.

టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌లో రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని విమర్శలు చేశారు. ఈ పరిణామం హిందువులను మనోవేదనకు గురి చేస్తోందని.. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. యామిని సాధినేని టీడీపీలో ఉన్న సమయంలో తన మాటలతో వార్తల్లో నిలిచింది. పలువురు ప్రముఖుల మీద కూడా యామిని సాధినేని గతంలో ఫైర్ అయ్యింది. టీడీపీలో పనిచేశారు.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై పలువురు తప్పుబట్టారు. కానీ యామిని సాధినేని చేసిన వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉండడంతో టీటీడీ సీరియస్ అయ్యింది.

ఎస్వీబీసీ ఛానల్‌లో రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోండడంతో భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయకపోయారు. కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని.. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని టీటీడీ వివరణ ఇచ్చింది.

Next Story