టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం నిజమేనా??
By సత్య ప్రియ Published on 2 Dec 2019 2:09 PM ISTకొత్త సంవత్సరం రాబోతోంది, 2020 వైపుకి మనమంతా వేగంగా అడుగులు వేస్తున్నాం. సంవత్సరాదిని స్వాగతిస్తూ ఎన్నో సంస్థలు కొత్త క్యాలెండర్లు, డైరీలు విడుదల చేస్తాయి. తిరుమల తిరుపతి దెవస్థానం వారు, నవంబర్ 29, 2019 శుక్రవారం రోజున వచ్చే సంవత్సర డైరీలను విడుదల చేశారు.
తరువాత, సోషల్ మీడియాలో " టీటీడీ క్యాలెండర్ 2020 పిడిఎఫ్ " అంటూ సేర్చ్ చేస్తే గూగుల్ ఫలితాలలో “శ్రీ యేసయ్య” అనే క్రైస్తవుల ప్రార్ధన కనబడుతోందంటూ ఒక మెసేజ్ వైరల్ గా మారింది.
ట్విట్టర్ లోనే కాకుండా వాట్సాప్ లో కూడా ఈ మెసేజ్ వైరల్ గా మారింది. ఈ మెసేజ్ లో "శ్రీ యేసయ్య. శ్రీ వేంకటేశాయ నమ: శ్రీవికారినామ సంవత్సర, సిద్దాంత పంచాగము. 2019 -2020" అని వుంది.
దక్షిణ భారత దేశంలో అత్యంత మహిమాన్విత దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది, అటువంటి ఆలయానికి చెందిన వెబ్ సైట్ లో అన్య మత ప్రచారం బాహాటంగా జరగడంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు బాధ కలిగించింది.
ఈ వార్త అన్ని మీడియాలలో సంచలన వార్తగా నిలిచింది.
టీటీడీ సంస్థ వారు ఈ అంశంపై దర్యాప్తు నిర్వహించారు. అయితే, శ్రీ యేసయ్య అనే పదం 2019 - 2020 సంవత్సర పంచాంగం డాక్యుమెంట్ వెతికినప్పుడు కనిపించింది. తరువాత అది కనపడకుండా టీటీడీ వారు బ్లాక్ చేశారు.
కొద్దికాలంగా క్రైస్తవ ప్రచారానికి సంబంధించిన ఇలాంటి సంఘటనలు ఎన్నో టీటీడీ ని కలచి వేస్తున్నాయి. తిరుమల బస్సు టికెట్ల పై జెరుసలెం యాత్ర ప్రకటనలు గానీ, హిందువేతర సిబ్బంది విషయం గానీ, టీటీడీ వెబ్ సైట్ లో యేసు ను గురించి రాసిన పుస్తకం ప్రచురించడం వంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటి అంశంలో, టీటీడీ కి చెందిన క్యాలెండర్ కోసం వెతకగా గూగుల్ సేర్చ్ ఫలితాలలో "శ్రీ యేసయ్య" అనే పదం వస్తోంది అనే అరోపణ నిజం. ఈ ఉదంతం పై టీటీడీ అధికారులు విచారణకు అదేశించారు.
ఇది గూగుల్ తప్పిదం అంటున్న టిటిడి అధికారులు:
అయితే, ఆదివారం డిసంబర్ 1న టిటిడి చైర్మన్ యై వి సుబ్బా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ప్రచార ముద్ర వేస్తూ ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టకరమని, టీటీడీ ప్రతిష్ట దిగజార్చి, భక్తుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే సహించమని, తప్పుడు ప్రచారాలు చేసినవారి పై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫ్ లో పదాలను ఉన్నదిఉన్నా లాగే ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని, గూగుల్ అనువాదం లో జరిగిన పొరపాట్ల వల్ల ఈ తప్పిదం జరిగిందని, శ్రీయై నమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చిందని, అంతే కానీ టీటీడీ వెబ్ సైట్ లో ఎలాంటి పొరపాటు జరగలేదని అన్నారు.