టీటీడీపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు.. హీరో సూర్య తండ్రిపై కూడా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 7:05 PM ISTఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యురాలు, రచయిత్రి.. టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై టీటీడీ అధికారులు స్పందించారు. ఈ విషయమై ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు అధికారులు తెలిపారు.
అలాగే.. ప్రముఖ హీరో సూర్య తండ్రి, తమిళ నటుడు శివకుమార్‌పై కూడా టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వీడియోలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశారని.. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారని.. శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్.. శివ కుమార్‌పై ఈమెయిల్ ద్వారా టీటీడీకి సమాచారం ఇచ్చారని.. శివకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు.
అంతేకాకుండా.. జూన్ 30 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంటూ సోషల్ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా వీరిపై కేసు నమోదైంది.