సానుకూల వాతావరణం సృష్టిస్తే విధుల్లో చేరుతాం : జేఏసీ నేతలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 12:01 PM GMT
సానుకూల వాతావరణం సృష్టిస్తే విధుల్లో చేరుతాం : జేఏసీ నేతలు

ముఖ్యాంశాలు

  • సమ్మె విరమించేందుకు సిద్దమన్న జేఏసీ నేతలు
  • ప్రభుత్వం సానుకూల వాతావరణం సృష్టించాలన్న నేతలు
  • ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్న జేఏసీ

హైదరాబాద్ : ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీనికి సంబంధించి లేఖ కూడా విడుదల చేశారు. అయితే.."కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధులు నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పించాలని జేఏసీ నేతలు కోరారు. అప్పుడే సమ్మె విరమించిన కార్మికులు విధుల్లో చేరతారని" లేఖలో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అయితే..ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలన్నారు. అప్పుడు విధుల్లోకి వస్తామన్నారు. సమస్యను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. దాదాపుగా కార్మికులు సమ్మె విరమించినట్లే..ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడమే ఆలస్యం.

నేటికి టీఎస్ఆర్టీసీ సమ్మె మొదలై 47 రోజులు . దాదాపు 30 మంది కార్మికులు ఈ 47 రోజుల్లో ప్రాణాలు తీసుకున్నారు. కొంత మంది గుండె ఆగి చనిపోయారు. ఈ 47 రోజుల్లో ఆర్టీసీ వందల కోట్ల రూపాయల నష్టం వచ్చి ఉంటుంది. అయితే...ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటారనేది ప్రధాన సమస్య. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోలేమంటూ కోర్టులోనే చెప్పేసింది. ఎవరూ చేయని రీతిలో ఆర్టీసీకి తమ ప్రభుత్వం సేవ చేసిందని కేసీఆర్‌ సర్కార్ హైకోర్ట్‌కు నివేవదించారు. కొంత మంది జేఏసీ నేతల స్వార్ధం వల్లనే సమ్మె చేశారని ప్రభుత్వం పలు మార్లు ఆరోపించింది .అంతేకాదు..సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని కోర్ట్‌ను కోరింది.

దసరా పండుగకు కొన్ని రోజులు ముందు ఆర్టీసీ సమ్మె మొదలైంది. దీంతో దసరాకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునేవారు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ వెహికల్స్ వారు ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో దారుణంగా దోచుకున్నారు. డ్రైవింగ్ వచ్చి రాని డ్రైవర్లతో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినా సరే ప్రభుత్వం, జేఏసీ నేతలు సమ్మెపై వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం, కార్మిక సంఘాల ఇగోలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు పాల్జేశాయి.

ఆర్టీసీ జేఏసీ నేతల వెనకాల ప్రతిపక్షాలున్నాయని ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తుంది. ప్రతిపక్షాల వలలో కార్మిక నేతలు చిక్కుకున్నారనేది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. విలీన డిమాండ్ కుదరదని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఆర్టీసీ ఓ కార్పొరేషన్ అని ..దీనిని విలీనం చేస్తే..మిగిలిన కార్పొరేషన్ల నుంచి కూడా ఇవే డిమాండ్లు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీ సమ్మెను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది.

సమ్మెపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి .చివరకు హైకోర్ట్ సమ్మె ఇష్యూను లేబర్ కోర్ట్ కు బదిలీ చేసింది. లేబర్ కోర్ట్ ఏం చెబుతోందో చూడాలి.

Next Story