హైదరాబాద్‌: సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ భేటీ ముగిసిన తరువాత నేతలు ఈ ప్రకటన చేశారు. సమ్మెపై ఆర్టీసీ కార్మికుల అభిప్రాయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు. జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు తమకు హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ తీర్పు కాపీ తమకు ఇప్పటి వరకు అందలేదన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందాక సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు.

ఎల్బీనగర్‌లో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోల కార్మికులతో జేఏసీ నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. వారితో సమావేశమయ్యి అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశానికి జిల్లాల నుంచి భారీగా కార్మికులు తరలివచ్చారు.

ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె..!: కార్మికులు

సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 46 రోజుల సమ్మె, జేఏసీ నిర్ణయాలు, ప్రభుత్వ కోణం, హైకోర్టులో వాదనలు పలు విషయాలపై కార్మికులతో జేఏసీ నేతలు చర్చించారు. సమ్మెకు సంబంధించిన వాదనలు లేబర్ కోర్ట్‌కు హైకోర్టు బదిలీ చేయడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులు సమయం పడుతుందని చెప్పారు. అయితే..ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె చేయాలని చాలా మంది కార్మికులు పట్టుబట్టినట్లు సమాచారం.

ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఎలా…?!: కార్మికులు

హఠాత్తుగా సమ్మె విరమిస్తే ఏం సాధించినట్లని నేతలను కార్మికులు నిలదీసినట్లు తెలుస్తోంది. సమ్మె విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకునే గ్యారంటీ వుందా అని నేతలను కార్మికులు ప్రశ్నించినట్లు సమాచారం. లేబర్ కోర్టులో తీర్పు వచ్చే వరకైనా సమ్మె కొనసాగించాలని మెజార్టీ కార్మికులు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పెట్టి ఓట్లతో సమ్మెపై అభిప్రాయాన్ని సేకరించాలని కూడా కార్మికులు కోరారు.

సమ్మెపై కార్మికులు, నేతలు మల్లగుల్లాలు..!

46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నప్పటికీ స్పష్టమైన క్లారిటీ మాత్రం లేదు. 24మంది కార్మికుల మరణాలపై కూడా జేఏసీ నేతలు చర్చించారు.అయితే…ఫస్ట్ లో ఉన్న స్పీడ్ ఇప్పుడు కార్మికుల్లో కనిపించడంలేదు. ప్రభుత్వం దయతలిస్తే చాలు అన్నట్లు జేఏసీ నేతలు, కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..బేషరతుగా విధుల్లో చేరితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపై కూడా కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం డెడ్ లైన్లకు గతంలో పెద్దగా స్పందన రాలేదు. ఇప్పుడు మాత్రం కార్మికుల్లోనే ప్రభుత్వ ఆలోచనపై చర్చ జరగడం గమనార్హం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.