రూ.49.. రూ.100.. రూ.1000.. ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చిన నెల జీతం

By సుభాష్  Published on  11 July 2020 12:58 PM IST
రూ.49.. రూ.100.. రూ.1000.. ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చిన నెల జీతం

కరోనా కాలంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదన్న విషయం అందరికి అర్థమైపోతుంది. తమ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రపంచంలోని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఎదురవుతున్న ఉదంతాలు చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చిన జీతాల లెక్కలు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలంతే. సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్ బేసిక్ శాలరీ రూ.15వేలు. అన్ని కలుపుకొని ఆ డ్రైవర్ కు వచ్చే జీతం రూ.20వేలకు కాస్త పైనే. అలాంటి ఆ ఉద్యోగికి జూన్ నెలలో వచ్చిన జీతం ఎంతో తెలుసా? అక్షరాల రూ.49 మాత్రమేనట.

అదే రీతిలో రూ.30వేలు నెలకు జీతం రావాల్సిన మరో డ్రైవర్ కు వచ్చిన జీతం కేవలం రూ.1600 మాత్రమేనట. ఇలా సంగారెడ్డి డిపోలోని ఉద్యోగుల్లో 20 మందికి రూ.100 లోపు.. యాభై మందికి రూ.వెయ్యి లోపు జీతాలు వచ్చాయట. భద్రాచలం డిపో ఉద్యోగులు 483 మందిలో 400 మందికి ఇలాంటి పరిస్థితే ఉందట. గడిచిన మూడు నెలలుగా యాబై శాతం జీతాలు వస్తున్న వేళ.. జూన్ జీతాలు పూర్తిగా వస్తాయని భావించిన ఆర్టీసీ ఉద్యోగులకు కోత పిడుగుపడింది.

మామూలు రోజుల్లో నాలుగైదు తారీఖుల్లో వచ్చే జీతం జూన్ జీతం మాత్రం తొమ్మిది.. పది తారీఖుల్లో పడింది. అకౌంట్లో పడిన జీతం లెక్క చూసుకున్నోళ్లకు వణుకు తెప్పించింది. అన్ని డిపోల్లోనూ ఎక్కువమంది ఉద్యోగులకు ఈఎస్ఐ.. పీఎఫ్ కటింగ్ లు పోగా చేతికి వచ్చిన మొత్తాల్ని చూసి లబోదిబోమంటున్నారు. ఇంతకీ.. ఇంత తక్కువ జీతం ఎందుకు వచ్చిందంటే.. మీరు డ్యూటీకి రావటం లేదని డిపో మేనేజర్లు చెబుతున్న మాటలతో ఏం చేయాలో పాలుపోవటం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వ అనుమతితో మే 19 నుంచి బస్సులు తిరుగుతున్నా.. ప్రయాణికుల రద్దీని అనుసరించి..కొన్ని బస్సుల్ని మాత్రమే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులకు రోజూ డిపోలకు వెళుతున్నా.. బస్సులు తిరగని కారణంగా డ్యూటీలు వేయటం లేదు. కొద్దిమంది ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు పెడితే.. మరికొందరికి మాత్రం ఓ మోస్తరుగా కోతలు విధించారు.

భద్రాచలం డిపోలో మొత్తం 485 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో 400 మంది ఉద్యోగులకు వేతనాల్లో కోతలు పడ్డాయి. పరిగి డిపోలో 80 మంది ఉద్యోగులకు.. హైదరాబాద్ లోని మెహిదీపట్నం.. మియాపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే కోత పడని డిపోలు లేవన్న మాట వినిపిస్తోంది. పేరుకు వందశాతం జీతాలు ఇస్తున్నట్లు చెబుతున్నా.. కోతలు మాత్రం ఓ రేంజ్లో సాగుతున్నాయని చెబుతున్నారు.

డిపోలకు వెళ్లి సమయానికి రిపోర్టు చేసినా.. సాయంత్రం వరకు అక్కడే కూర్చోబెట్టి ఆ రోజుకు అవసరం లేదని తిప్పి పంపుతున్నా మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఇలా.. ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తున్న జీతాల లెక్క ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇదేం పద్దతి అని పలువురు మండిపడుతున్నారు. సంపన్నరాష్ట్రంలోని ఉద్యోగులకు ఇదేం దుస్థితి?



Next Story