తల్లీ.. నీకు వందనం.. 8 మందికి జన్మనిచ్చి.. 9వ కాన్పుకు సిద్ధంగా ఉన్న మాతృమూర్తి

By సుభాష్  Published on  11 July 2020 3:09 AM GMT
తల్లీ.. నీకు వందనం.. 8 మందికి జన్మనిచ్చి.. 9వ కాన్పుకు సిద్ధంగా ఉన్న మాతృమూర్తి

ప్రస్తుతం బతకడమే భారమన్న రోజులివి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కంటుంటారు. ఎందుకంటే ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ అన్నట్లు ఉంది. దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న ఖర్చులు.. చదువులు.. ఖర్చుల దృష్ట్యా ఇద్దరిని పెంచి పోషించడమే భారంగా మారింది. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 మందికి జన్మనిచ్చి 9వ కాన్పుకు సిద్ధమవుతోంది. తొమ్మిదో నెల పరీక్ష చేయించుకునేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చింది. తెలంగాణలోని పాల్వంచ మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం ఇడిమా (35) మహిళకు మొత్తం 8 మంది సంతానం. ఇడిమా ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి.

అయితే 9వ నెల కావడంతో ఆశా కార్యకర్తల సహాయంతో ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. అత్యంత అరుదుగా వచ్చే కాన్పు కావడంతో సమాచారాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకువచ్చారు వైద్య సిబ్బంది. ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించగా, రక్తం కూడా సరిపడ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇతర సమస్యలు కూడా ఏవి లేకపోవడంతో తొమ్మిదో కాన్పు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే గతంలో జరిగిన 8 కాన్పులు కూడా నార్మల్‌ కావడం విశేషం. అవి కూడా ఇంటి వద్దే కాన్పు జరిగినట్లు ఇమిడి చెబుతోంది. కాగా, ఎనిమిది మంది సంతానంలో ఇద్దరు చనిపోయారని, పెద్ద కుమార్తెకు కూడా వివాహం చేసినట్లు తెలిపింది. ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించి, మందులిచ్చి 102 వాహనంలో ఇంటికి పంపించారు. ఇలాంటి అరుదైన కాన్పులను వైద్య భాషలో 'గ్రాండ్‌ మల్టీ ప్యారా' అంటారని సూపరింటెండెంట్‌ ముక్కంటేశ్వరరావు తెలిపారు. ఇక 9వ ప్రసవం జరిగిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. ఈ రోజుల్లో కూడా ఇంత మంది పిల్లలను కనడం ఆ తల్లికి ఎంత ఓపికో.. అంటూ గుసగుసలాడుకుంటున్నారు ఇతర మహిళలు.

Next Story