అబ్కారీలో ట్యాబ్‌ల అక్రమాలు.. ఆడిట్‌లో వెల్లడి

By అంజి  Published on  28 Jan 2020 3:47 AM GMT
అబ్కారీలో ట్యాబ్‌ల అక్రమాలు.. ఆడిట్‌లో వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్ర అబ్కారీశాఖలో భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ట్యాబ్‌ల కొనుగోలుకు సంబంధించి గత రెండేళ్లుగా అబ్కారీ శాఖ లెక్కలు చూపించడం లేదని ఆడిట్‌ అధికారులు చెప్తున్నారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకొని నడిపించిన ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ఇంత జరుగుతున్న అబ్కారీ శాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆ శాఖకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అబ్కారీశాఖలో ఎక్కువ కాలం బదిలీలు లేకుండా ఒకే చోట ఉండిపోతుండటంతో చాలా మందికి అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు వారి పనితీరును మెరుగుపర్చాలనుకున్నారు. సీఐ నుంచి అదనపు కమిషనర్‌ స్థాయి వరకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అబ్కారీశాఖ అధికారుల పారదర్శక సేవలను ఈ ట్యాబ్‌ల్లో పొందుపర్చడం వల్ల పనితీరును, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా 848 ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.21,779.

నిబంధనలు ప్రకారం ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. నిధులు మంజూరు అయ్యాక టెండర్లు పిలవాలి. కానీ వెంటనే ట్యాబ్‌లను సరఫరా చేయాలన్న ఉద్దేశంతో బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 2 కోట్ల అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించే పద్ధతిలో టీఎస్‌టీఎస్‌ సహకారంతో ట్యాబ్‌లను కొనుగోలు చేశారు. టెండర్లు పిలిచిన తర్వాత తక్కువ కోట్‌ చేసిన సంస్థకే కాంట్రాక్టును ఇస్తారు. కానీ అలాంటివేవి పట్టించుకోకుండా ఒకే సంస్థకు ఈ పని అప్పగించారు. 2017 నవంబర్‌లో 478 ట్యాబ్‌లు కొనుగోలు చేశారు. అందులో 358 ట్యాబ్‌లు సిబ్బందికి సరఫరా చేశారు. మిగతా ట్యాబ్‌లు ఏమయ్యాయి అన్నది ఇప్పటికి తేలియరాలేదు. ట్యాబ్‌ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు.. దీంతో నిధులు కూడా మంజూరు కాలేదు. బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న అప్పును అబ్కారీశాఖ అధికారులు ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదు. ట్యాబ్‌ల కొనుగోలుకు సంబంధించి ఎక్కడా కూడా సరైన పత్రాలు లేవని తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను, లెక్కలను అధికారులు ఇవ్వలేదని ఆడిట్‌ అధికారులు అంటున్నారు. ఇప్పటికే దీనిపై విచారణ జరిపించాలని ఆడిట్‌ అధికారులు ప్రభుత్వాన్నికోరారు.

Next Story