ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు పోండ్రి
By Newsmeter.Network Published on 16 Jan 2020 2:30 PM ISTహైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార వ్యూహం, ప్రచార సరళిపై అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ లోకల్ మేనిఫెస్టోలు రూపొందించుకొని ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలవాలని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. దేశంలోనే తెలంగాణ మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో 10 శాతం బడ్జెట్ గ్రీనరీ కోసం కేటాయించామన్నారు. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ అభ్యర్థులు, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతోంది.
రాష్ట్రంలో మూడు వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బీజేపీకి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ అన్నారు. బీ ఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు, గెలుపు మనదే.. అతి విశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయాలని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. 3 లక్షల 75 వేల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో 35-45 శాతం డబ్బులు ఆదా అవుతున్నాయన్నారు. పట్టణాల్లో ఇప్పటికే మిషన్ భగీరథలో భాగంగా బల్క్ వాటర్ సప్లై చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. పట్టణాలకు ప్రత్యేక నిధులు కార్పొరేషన్లకు బడ్జెట్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులిస్తోందని కేటీఆర్ వివరించారు. ఇప్పటికే టీయూఎఫ్‌ఐటీడీసీ ద్వారా రూ.25 వందల కోట్లతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.