ప్రత్యర్థుల విషయంలో ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకుపడే తత్త్వం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ కు అలవాటే. ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకూ తన మీద ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవటం.. ఒక విమర్శ.. ఆరోపణలు ఎదురుకాకుండా జాగ్రత్త పడే విషయంలో హరీశ్ కు మించినోళ్లు ఉండరు. ఏ సందర్భంలోనూ ఆయన సారీ చెప్పింది కనిపించదు. అంతేకాదు.. రాజకీయంగా ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం ఆయనకు ఎప్పుడూ రాలేదు కూడా.

ఆ మాటకు వస్తే.. పలు సందర్భాల్లో అయ్యో.. హరీశ్ అనుకోవటమే తప్పించి.. ఆయన్ను తప్పు పట్టేవారు కనిపించరు. అలాంటి ఆయన.. తాజాగా అందరికి సారీ చెప్పటం ఆసక్తికరంగా మారింది. హరీశ్ ఏమిటి? సారీ చెప్పటం ఏమిటి? అన్న సందేహం అక్కర్లేదు. ఎప్పుడూ క్షమించాలని అడగని ఉద్యమ నేత నోట ఆ మాట రావటం వెనుక అసలు కారణం వేరే ఉంది.

ఇవాళ ఆయన పుట్టినరోజు. ఆయన్ను పలుకరించటానికి.. అభినందనలు తెలియజేయటానికి.. శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున ఆయన్ను కలిసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వేడుకలకు సమయం కాదని.. అందరూ రావటం ఏ మాత్రం మంచిది కాదన్నది హరీశ్ ఆలోచన. అందుకే.. తనకు తానే ఒక ప్రకటన చేవారు. తన పుట్టినరోజు సందర్భంగా తనను కలిసేందుకు వస్తామని వేలాదిమంది అభిమానులు ఫోన్లు చేస్తున్న విషయాన్ని చెప్పిన హరీశ్.. అందరి అభిమానానికి తాను ధన్యుడినని చెప్పారు.

అందరికి పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్న ఆయన.. తనను కలిసేందుకు మాత్రం ఎవరూ రావొద్దన్నారు. అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం శ్రేయస్కరం కాదన్నారు. ఎలాంటి వేడుకలు జరపొద్దని.. ఎవరూ తనను కలవటానికి రావొద్దన్నారు. మాయదారి రోగం పొంచి ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలన్న సూచన చేసిన హరీశ్.. అభిమానంతో తనను కలిసేందుకు వస్తానన్న వారిని రావొద్దని చెప్పినందుకు అందరూ తనను క్షమించాలన్నారు. అదీ.. హరీశ్ సారీ వెనుక అసలు కథ.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story