ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ..? అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు
By సుభాష్ Published on 22 Sep 2020 6:45 AM GMTతెలంగాణలో మవోయిస్టుల కదలికలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో చొరబడుతున్న మావోయిస్టులను వెనక్కి తరిమికొట్టాలని పోలీసు బలగాలు చూస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీగా మావోయిస్టులు కాచుకుని కూర్చున్నారని సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్ దళాలు అప్రమత్తం అయ్యాయి. వీరు రాష్ట్రంలోకి చొరబడినట్లయితే తీవ్రమైన విధ్వంసాలకు దిగే అవకాశాలుండటంతో దండకార్యణంలో జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కిలోమీటర్లర దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే వారిని నిలువరించేందుకు సీఆర్పీఎఫ్ కోబ్రా, గ్రౌహౌండ్స్ దళాలు డ్రోన్ కెమెరాల ద్వారా మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచాయి. అయితే సీఆర్పీఎఫ్ వద్ద ఉన్న డ్రోన్ కెమెరాలు ఎంతో ప్రత్యేకమైనవి. భూమి మీద చిన్న చీమనైనా గుర్తించే శక్తి ఈ డ్రోన్ కెమెరాలకు ఉంటుంది. అంతేకాకుండా వేల మీటర్ల ఎత్తున ఎగిరే వీటిని భూమి మీద నుంచి గుర్తించడం సాధ్యం కాదు.
(మావోయిస్టులు వాగు దాటుకుంటూ తెలంగాణ వైపు వస్తున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కిన వైనం)
ఆ 300 మావోయిస్టులు ఎక్కడ..?
ఈనెల 13న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 300 మంది మావోయిస్టులు వాగుదాటుతున్న దృశ్యాలు సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. వీరు సమీపంలోని ఇంజారం గ్రామం వరకు వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇంత మంది మావోలు ఎక్కడ ఉన్నారనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. వారిని తరిమికొట్టేందుకు పోలీసు బలగాలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. వీరు ఇతర మార్గాల ద్వారా సరిహద్దు వెంబడి రాకుండా పోలీసు బలగాలు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాయి.