డ్రోన్‌ కెమెరాకు చిక్కిన మావోయిస్టుల కదలికలు

By సుభాష్  Published on  14 Sep 2020 7:14 AM GMT
డ్రోన్‌ కెమెరాకు చిక్కిన మావోయిస్టుల కదలికలు

మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినూత్న టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం మంచి ఫలితాలిస్తున్నాయి. ఆదివారం పోలీసులు డ్రోన్‌ వీడియో కెమెరా ద్వారా మావోలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు కనుగొన్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు వాగును దాటుతున్న దృశ్యాలు డ్రోన్‌ కెమెరాకు చిక్కారు.

ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఎక్కువైపోతుండటంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య నిరంతరం పోరు కొనసాగుతోంది. అయితే గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ అడుగు పెట్టారు మావోయిస్టులు. తమ కార్యకలాపాలు పెంచుకుంటూ వస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసు బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్‌ల సాయంతో కనిపెడుతున్నారు. కాగా, భద్రాది కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుమార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3వ తేదీన భద్రాది జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు.

ఈ నేపథ్యంలో వారిని కనిపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగించగా, వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు పోలీసు ఉన్నతాధికారులు. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లోని పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 200లకుపైగా మావోయిస్టులు దట్టమైన అడవిలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేవు. కొన్ని రోజుల నుంచి తెలంగాణలో మళ్లీ మావోల కార్యకలాపాలు మొదలు కావడంతో పో్లీసులు అప్రమత్తం అయ్యారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెంచారు.

Next Story