తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి..
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2020 4:11 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కరోనా నివారణ చర్యల విషయంలో ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. నివేదిక, నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ చార్జీలపై ఈనెల 22న రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అనుమానంగా ఉందని, వీటిని బట్టి చూస్తూ కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదనే భావనను హైకోర్టు వ్యక్తం చేసింది. కరోనాకు ముందు, తర్వాత వైద్యరంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలని తెలిపింది. జిల్లా స్థాయి బులెటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వరకూ జిల్లాల వారీగా బులెటిన్లు సమర్పించాలని చెప్పింది. జీహెచ్ఎంసీలోని ఐసోలేషన్, కోవిడ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని చెప్పింది. జిల్లాల నుంచి కరోనా బాధితులను హైదరాబాద్ వచ్చేందుకు అంబులెన్సులు పెంచాలని, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ల్యాబ్‌లను పెంచాలని సూచించింది.
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఎన్ని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు.. చర్యలపై నివేదిక సమర్పించాలని తెలిపింది. 50శాతం బెడ్స్‌పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలని.. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజలకు సేవచేసే బాధ్యత లేదా..? అని ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్పత్రులపై విచారణ జరిపి ఈనెల 22లోపు నివేదిక అందజేయాలని జాతీయ ఫార్మా సంస్థను.. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల24కు వాయిదా వేసింది.