తెలంగాణ ఖైదీలు.. ది బెస్ట్

By సుభాష్  Published on  4 Sep 2020 8:18 AM GMT
తెలంగాణ ఖైదీలు.. ది బెస్ట్

ఖైదీలేంటి.. బెస్ట్ ఏంటి అనిపిస్తోందా? వాళ్ల గతం ఎలా ఉన్నా.. వర్తమానంలో మంచి పని చేస్తున్నపుడు అభినందించాల్సిందే. తెలంగాణ జైళ్లలో ఉన్న ఖైదీల పనితనం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఏవో తప్పులు చేసి శిక్షలో భాగంగా జైళ్లకు వచ్చే ఖైదీల్లో మార్పు తేవడం కోసం వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి.. వారితో పని చేయించి.. శిక్షా కాలం ముగిశాక బయట సులువుగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దడం ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారమే. ఐతే ఈ ప్రక్రియ ఏదో మొక్కుబడిగా కాకుండా.. ఎంతో చిత్తశుద్ధితో చేసిన తెలంగాణ జైళ్ల శాఖ.. ఖైదీల నుంచి అనూహ్య స్థాయిలో ఉత్పత్తులు రాబట్టింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-2019 నివేదిక ప్రకారం తెలంగాణ జైళ్లలోని ఖైదీలో ఏడాది వ్యవధిలో ఏకంగా రూ.600 కోట్ల విలువైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడం విశేషం.

దేశంలోనే ఒక రాష్ట్ర ఖైదీలు అత్యధిక ఉత్పత్తులు తయారు చేసింది తెలంగాణలోనే.

ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నది తమిళనాడు ఖైదీలు. కానీ తెలంగాణ ఖైదీలకు వారికి అంతరం చాలా ఎక్కువ. వాళ్లు 72.96 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు చేశారు. మూడో స్థానంలో ఉన్న తెలంగాణ ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విలువ రూ.29.40 కోట్లే. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింట్లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల మొత్తం విలువ కంటే తెలంగాణ ఖైదీల చేతిలో తయారైన ఉత్పత్తుల విలువ ఎక్కువగా ఉండటం విశేషం.

దీన్ని బట్టి మన ఖైదీల ప్రత్యేకత ఏంటో.. వారిని నడిపిస్తున్న జైళ్ల శాఖ పనితీరు ఎలాంటిదో అంచనా వేయొచ్చు. తెలంగాణకు చెందిన ఒక ఖైదీ సగటున 8.93 లక్షల విలువైన వస్తువులు తయారు చేయడం విశేషం. తెలంగాణలో ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులను మై నేషన్ బ్రాండు పేరుతో జైళ్ల శాఖే స్వయంగా విక్రయిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మాస్కులు, శానిటైజర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఖైదీలతో అవే తయారు చేయిస్తున్నారు. ఖైదీలకు పనికి తగ్గ కూలి కూడా ఇస్తన్నారు. శిక్షా కాలం పూర్తయ్యేసరికి చేసిన పనికి తగ్గ కూలి వస్తుంది. బయటికెళ్లాక ఈ చేతి వృత్తులతో బతకడానికీ అవకాశముంటుంది.

Next Story