కరోనా ఎఫెక్ట్: తెలంగాణ ప్రభుత్వ పాలనలో భారీ మార్పు..!
By సుభాష్ Published on 23 May 2020 4:38 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ కావు. కరోనాను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది. ప్రభుత్వ పాలనలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెరుగైన పాలన అందించడమే కాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో వేగవంతం చేయాలని భావిస్తుందట. అందు కోసం టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది. అసలు కాగితాలతో పని లేకుండా మొత్తం
డిజిటల్‌లో పనులు జరిగినట్లయితే కరోనా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ సెక్రెటరీయేట్ నుంచి జిల్లాల్లో కార్యాలయాల వరకూ అంతా ఈ-డ్మినిస్టేషన్ తీసుకువచ్చేందుకు చర్చలు కొనసాగిస్తోంది. ఉద్యోగులు గుంపులు, గుంపులుగా ఉండకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ పరంగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం ఓ అప్లికేషన్ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే అన్ని ప్రభుత్వ శాఖలు ఉంటాయి. అంతేకాదు దేనికి దానికే ప్రత్యేక ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఉంటాయి. అలాగే ఉద్యోగులకు కూడా ఐడీలు, పాస్ వర్డ్‌లు ఇస్తారు. అందరు ఈ యాప్‌లోనే పని చేస్తారు. దీంతో అంతా ఎలక్ట్రానికి పాలన జరుగుతుందనే అంచనా ఉంది.
అంతేకాదు అందరు ఒకే యాప్‌పై పని చేయడం వల్ల ఒత్తిడి పెరిగి క్రాష్ కావడం, హ్యాంగ్ కావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో అలాంటిది జరుగకుండా ముందు జాగ్రత్తగానే భారీ సర్వర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లు, కరెంటు బిల్లులు, తదితరాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ విధంగానే ప్రభుత్వ పాలన కూడా ఆన్‌లైన్ చేసేందుకు పెద్ద ప్రయత్నాలే కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం అందుబాటులో ఉంది. దీని ద్వారా అన్ని జిల్లాలు, కార్యాలయాల్లో డిజిటల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు. అయితే దీనిని కూడా భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్దమవుతోంది సర్కార్. దీంతో ప్రభుత్వ ఫైళ్లు కూడా ఆన్‌లైన్ కాబోతున్నాయి. ఇది జరిగితే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, చర్చలు, ఇతర పథకాలు అన్ని కూడా డిజిటల్ మయంకానుంది.