కొమురంభీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ పర్యటన.. అసలేం జరుగుతోంది..?

By సుభాష్  Published on  2 Sept 2020 3:21 PM IST
కొమురంభీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ పర్యటన.. అసలేం జరుగుతోంది..?

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌, రామగుండం సీపీ సత్యనారాయణ ఉన్నారు. హెలిప్యాడ్‌ వద్దే అధికారులతో మావోయిస్టు కదలికలపై సమీక్షించారు. అయితే మావోయిస్టుల సంచారం నేపథ్యంలో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆదిలాబాద్‌, తిర్యాణి, నార్నూరు, దేవపూర్‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 45 రోజుల వ్యవధిలో రెండో సారి ఆసిఫాబాద్‌లో డీజీపీ పర్యటన కొనసాగుతోంది. అగ్రనేతల లొంగుబాటు వార్తల నేపథ్యంలో డీజీపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జూలై 17న పర్యటించారు. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్‌ అడవుల్లో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు వారు చిక్కలేదు.

మారో వైపు మావోయిస్టు అగ్రనేత గణపతి అనారోగ్యం కారణంగా తన కుటుంబ సభ్యులతో పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న తెలిసిందే. దీనిపై ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సమాచారం. 74 ఏళ్ల గణపతి గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యం కారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుచుకున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన లొంగిపోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆదిలాబాద్‌లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టు భాస్కర్‌రావు డైరీ దొరికింది. అందులో కొందరు ప్రముఖ మావోయిస్టుల పేర్లున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డీజీపీ పర్యటన చర్చనీయాంశమైంది.

Next Story