బ్రేకింగ్: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి
By సుభాష్ Published on 31 March 2020 1:05 AM GMTతెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించగా, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందడంపై మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, అపోలో ఆస్పత్రిలో ఒకరు, గ్లోబల్ ఆస్పత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాల్‌లో ఒకరు మరణించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో వీరి ద్వారా వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్‌లో మత పరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. రెండు వేల మంది భారతీయులు ఈ ప్రార్థనలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో కొందరు కరోనా బారిన పడ్డారు. అందులో తెలంగాణకు చెందినవారున్నారు. వీరి ద్వారా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అధికం కానున్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అనుమానితులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించాయి. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా సోకినట్లు తెలుస్తోందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. తెలంగాణకు సంబంధించిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారు విధిగా తమ సమాచారం అందించాలని సూచించింది. మరోవైపు నిజాముద్దీన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న ఈ మర్కజ్ మసీద్ మౌలానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచిన విషయంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
76కు చేరిన కరోనా కేసులు
కరోనా దేశ వ్యాప్తంగా బెంబేలెత్తిస్తోంది. తెలగాణలో సోమవారం ఒక్క రోజు ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. అందులో 13 మందిని సోమవారం డిశ్చార్జ్ చేయగా, మరో బాధితుడు ఇది వరకే డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.