కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఇతర షాపులతో పాటు మద్యం షాపులు కూడా మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు మద్యం దొరకకపోవడంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. మద్యం సుక్క లేకుండా మద్యం బాబులు నిలకడగా ఉండలేకపోతున్నారు. కేసీఆర్‌ సార్‌.. రోజుకు కొన్ని గంటలైనా మద్యం షాపులు తెరిపించండి.. అంటూ వేడుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా లిక్కర్‌, బార్లను సైతం మూసివేశారు.

కాగా, గత మూడు రోజులుగా మద్యానికి బానిసైన కొందరు విచిత్రంగా ప్రవర్తించడమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు పాల్పడగా, మరి కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. తెలంగాణలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించి ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మద్యం షాపులు మూసివేయడం వల్ల కొందరు విచిత్రం ప్రవర్తిస్తూ, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారనే విషయంపై అధికారులతో చర్చించారు.

సమావేశం అనంతరం మంత్రి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఎవరైన మద్యానికి బానిసై ఆందోళనకు గురైన వారిని రాష్ట్రంలోని ఎక్సైజ్‌శాఖ సిబ్బంది, ఎస్సై, సీఐలు గుర్తించాలని అన్నారు. వారు మానసిక వేదనకు గురికుండా సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైతే వారికి సమీపంలో ఉన్న పీహెచ్‌సీ సెంటర్లకు తీసుకెళ్లి చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మద్యానికి బానిసైన వ్యక్తుల కుటుంబాలకు కూడా పలు సూచనలు, సలహాలు చేశారు. అలాంటి వ్యక్తులపై దృష్టి సారించి మద్యం నుంచి మనసును మరల్చడానికి ప్రయత్నించాలని అన్నారు. కుటుంబ సభ్యులతో ఇతరాత్ర ఆటలు, చెస్‌, క్యారమ్‌ వంటివి ఆడుతూ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ఇంట్లో ఉంటూ యోగాసనాలు వంటివి చేసేలా చూడాలన్నారు. ఇక ప్రభుత్వం లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రకాల మద్యం షాపులు మూసివేసి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సమయం ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం షాపులు తీసేది లేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు.

కాగా, ఈనెల 22 నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మద్యం బ్లాక్‌లో దొరుకుతుందేమోనని సందుగొంతులు తెగ వెతుకుతున్నారు. కాస్త ఎక్కువ రేటైనా తీసుకుందామంటే దొరకని పరిస్థితి నెలకొంది.
దీంతో బ్లాక్‌లో మద్యం అమ్మేవారిపై కూడా పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు వైన్స్‌ షాపులు తెరుస్తారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అయ్యింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు తెరిచి ఉంటాయని ఓ జీవో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నిన్న కొందరు మద్యం షాపుల ముందు బారులు తీరారు. తర్వాత ఇది పచ్చి అబద్దమని తెలిసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.