ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా వైరస్‌

By సుభాష్  Published on  30 March 2020 11:00 AM GMT
ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా వైరస్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇక భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సైతం కరోనా విజృంభిస్తోంది. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబంలో 25 మందికి కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది. సాంగ్లి జిల్లా ఇస్లామ్‌పూర్‌లో ఓ ఉమ్మడి కుటుంబంలో ఈ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సౌదీ ఆరేబియాలో పర్యటించి మహారాష్ట్రకు వచ్చారు. మార్చి 23న వారికి కరోనా పరీక్ష లు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక ఆ కుటుంబంలో మిగతా 21 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ పాజిటివ్‌ వచ్చింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మొత్తం 47 మందికి పరీక్షలు నిర్వహించగా, 25 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదు కాలేదని, ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులందరూ పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారని, అందువల్లే ఒకరి నుంచి ఒకరికి సోకిందని జిల్లా కలెక్టర్‌ అభిజిత్‌ చౌదరి తెలిపారు. ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా సోకడంపై మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇక ఇప్పటి వరకు భారత్‌లో కరోనా కేసులు 1100 దాటిపోయాయి. తెలంగాణలో 70 కేసులు నమోదు కాగా, ఏపీలో 21 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు గంట గంటకు పెరుగుతున్నాయి. మరో వైపు అమెరికాను సైతం వణికిస్తోంది. అమెరికాలో లక్షా 50వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2500పైగా మరణాలు సంభవించాయి. రోజురోజుకు కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది.

Next Story