ముఖ్యాంశాలు

  • సబితానగర్‌ సర్కిల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌
  • పోలీసులతో భట్టి విక్రమార్క, సీతక్క వాగ్వాదం
  • కేటీఆర్‌ ఫాంహౌస్‌ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: శంకర్‌పల్లి మండలం జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యత్నించారు. ఇందుకోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో భట్టి విక్రమార్క, సీతక్కలు వాగ్వాదానికి దిగారు. కాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సబితానగర్‌ సర్కిల్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ కట్టారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన మంత్రే.. నిబంధనలు ఉల్లంఘించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు పెరిగాయన్నారు.

హైదరాబాద్‌ నగరంలోని శివారు ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములను నిబంధనలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకున్నారు. 111 జీవోకు విరుద్ధంగా బిల్డింగ్‌లు కట్టుకోవడం, ఆ తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. మీరు తెలంగాణ అమాయక ప్రజలను మభ్య పెడుతున్నారని.. ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను తమ పార్లమెంట్‌ సభ్యుడు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే.. అక్రమంగా అరెస్ట్‌ చేశారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌.. లేదని, అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమను శాసన సభ నుంచి సస్పెన్షన్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భట్టి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుతగిలారు. కోమటిరెడ్డి తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌కు తోడు మిగిలిన కాంగ్రెస్ సభ్యులుసైతం కేసీఆర్ ప్రసంగానికి అడ్డుతగలడంతో.. స్పీకర్‌ వారించినప్పటికీ వారు వినలేదు. భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనసూయ, జయప్రకాశ్‌రెడ్డి, పోడెం వీరయ్యలు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ అధికారం కోసమే తాపత్రయమని విమర్శించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.