'సీఎం కేసీఆర్'.. ఆ మూడు రోజులు ఎక్కడ ఉన్నారో తెలుసా.?
By అంజి
హైదరాబాద్: 'రాష్ట్రంలోనే సీఎం సారు.. అమెరికాలో అంటున్న సర్కారు' అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. 2014 జూన్ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు సీఎం కేసీఆర్ ఏయే విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఆయనతో పాటు వెళ్లిన అధికారులు ఎవరు?, ఒక్కో పర్యటనకు ఎంత ఖర్చు అయ్యింది?, అలాగే వివిధ అంశాలకు సంబంధించిన వివరాలు తెలపాలని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గత నెల 27న రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సమాధానం ఇచ్చింది.
మొత్తం మూడు విదేశీ పర్యటనలు సీఎం కేసీఆర్ చేశారని తెలిపింది. 2014 ఆగస్టులో సింగపూర్- మలేషియాల సీఎం కేసీఆర్ వెళ్లారని తెలిపింది. ఆ తర్వాత 2015 సెప్టెంబర్‌లో చైనాకు వెళ్లారని, 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు అమెరికాలో పర్యటించారని తెలిపింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లలేదు. 2016 ఆగస్టు 30వ తేదీన సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో అప్పటి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న క్యాంప్ ఆఫీసులో శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్ సీఎం కేసీఆర్ కలుసుకున్నారు.
అప్పుడు దీనికి సంబంధించి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారని జీఏడీ చెబుతోంది. కాగా సీఎం కేసీఆర్ మొదటి రెండు పర్యటనలకు అయిన ఖర్చు వివరాలు పరిశ్రమల శాఖ వద్ద ఉన్నాయని, అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ ఉన్నాయని జీఏడీ చెప్పిందని ఆంధ్రజ్యోతి కథనం రాసింది. అయితే ఆ ఖర్చుల వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. కేసీఆర్ పర్యటనలకు సంబంధించి జారీ చేసిన జీవోల వివరాలను కూడా ప్రభుత్వం తెలిపింది.
2016 ఆగస్టు 26న కేసీఆర్ అమెరికా పర్యటనకు జీవో ఆర్టీ నంబర్ 1895 జారీ అయినట్లు తెలిపింది. ఓ వ్యవసాయ సదస్సుకు హాజరుకావాల్సిందిగా 2016లో కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. కానీ కేసీఆర్ ఆ పర్యటనకు వెళ్లలేదు. అదే సమయంలో కేసీఆర్ హైదరాబాద్‌లో బీజీ బీజీగా ఉన్నారు. అయితే అమెరికాకు వెళ్లినట్లు జీవో జారీ అయిన విషయం కేసీఆర్‌కు తెలుసా? పర్యటనకు వెళ్లకుండా జీవో ఎలా జారీ అయ్యింది.?, ఈ పర్యటన కోసం ప్రభుత్వం ఏమైనా నిధులు విడుదల చేసిందా.? అన్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ పర్యటన రద్దైతే.. దరఖాస్తుదారుడికి ఇలా తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరమేంటీ.?