దణ్నం పెడుతూ కనిపించిన వృద్ధుడు.. చలించి కారు దిగిన సీఎం కేసీఆర్‌

By అంజి  Published on  28 Feb 2020 3:02 AM GMT
దణ్నం పెడుతూ కనిపించిన వృద్ధుడు.. చలించి కారు దిగిన సీఎం కేసీఆర్‌

ముఖ్యాంశాలు

  • క్యా హై భాయ్‌ అంటూ పలకరించిన సీఎం కేసీఆర్‌
  • దివ్యాంగుడిని సమస్యను పలకరించిన కేసీఆర్‌
  • అప్పటికప్పుడు ఫిబ్రవరి నెల పెన్షన్‌ అందజేసిన కలెక్టర్‌

హైదరాబాద్‌: ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టోలీచౌకీ రోడ్డుపై ఆగింది. వెంటనే వెనుక వస్తున్న కాన్వాయ్‌ కూడా ఆగిపోయింది. ఏం జరిగిందో అంటూ అధికారులు హైరానా పడ్డారు. అప్పటికే సీఎం కేసీఆర్‌ కారు దిగి ఓ వృద్ధుడి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఆ వృద్ధుడితో కేసీఆర్‌ మాట్లాడుతూ.. క్యా హై భాయ్‌.. సలామంటూ చేయి కలిపారు. ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్‌.. తన సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా సీఎం కేసీఆర్‌ తన దగ్గరికి రావడంతో.. ఆ వృద్ధుడు ఆనందపడ్డాడు.

తన బంధువు ఇంటికి ఓ శుభకార్యానికి సీఎం కేసీఆర్‌ వెళ్లి వస్తుండగా ఈ సన్నివేశం జరిగింది. 60 ఏళ్ల మహమ్మద్‌ సలీమ్‌.. చేతిలో ఓ వినతి పత్రంతో రోడ్డుపై సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా దండ పెడుతూ కనిపించాడు. అతన్ని చూసిన సీఎం కేసీఆర్‌ వెంటనే చలించిపోయారు. కారును ఆపి అతనికి దగ్గరికి వెళ్లాడు. నా పేరు మహమ్మద్‌ సలీం అంటూ పరిచయం చేసుకున్న ఆ వృద్ధుడు.. తాను గతంలో ఆటో డ్రైవర్‌ పనిచేసేవాడినని సీఎం కేసీఆర్‌కు చెప్పాడు. 9 సంవత్సరాలుగా అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని తెలిపాడు. 4 సంవత్సరాల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో కాలు విరిగిందని, తన కుమారుడి ఆరోగ్యం కూడా బాగా లేదని చెప్పుకుంటూ బాధపడ్డాడు. ఉండేందుకు ఇళ్లు కూడా లేదని సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. అతడి సమస్యలను పరిష్కరించాలని, దివ్యాంగుల పెన్షన్‌, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను మంజూరు చేయాలంటూ కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు.

అనంతరం సీఎం ఆదేశాల మేరకు టోలిచౌకీలోని మోతీమహల్‌లో ఉంటున్న సలీం ఇంటికి కలెక్టర్‌ వెళ్లి వివరాలు తీసుకున్నారు. సదరమ్‌ పత్రం ఉండటంతో అప్పటికప్పుడు ఫిబ్రవరి నెల పెన్షన్‌ రూ.3016 అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతని కుమారుడికి కూడా సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సహాయం అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సీఎం తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్న చాలా మంది ఆయన చూడాలని రోడ్డు కిరువైపులా గుమిగూడారు.

Next Story