సోషల్ మీడియాకు చుక్కలు చూపించే ట్రంప్ తాజా ఉత్తర్వు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 10:19 AM GMT
సోషల్ మీడియాకు చుక్కలు చూపించే ట్రంప్ తాజా ఉత్తర్వు

అసలే ట్రంప్. అందునా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. రానున్న కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలకవేళలో.. ట్రంప్ లాంటి అధినేతకు ఉండే ప్లానింగ్ ఒకటి ఉంటుంది. దీనికి ఇబ్బంది పెట్టేలా ఉన్నా.. చిరాకు తెప్పించినా ఆయన వెంటనే తనకు తోచిన నిర్ణయాన్ని తీసుకుంటారు. అది మంచా? చెడా? అన్నది అస్సలు ఆలోచించరు. తాజాగా అలాంటి పనే చేశారు ట్రంప్.

సోషల్ మీడియాకు దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చారు ట్రంప్. తాను చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ చెప్పిన ట్విట్టర్ కు వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ఆ బాటలో నడిచే ప్రయత్నం చేసే ఈ సోషల్ మీడియాకైనా తిప్పలు తప్పవన్న విషయాన్ని అర్థమయ్యేలా తాజాగా ఒక అధికారిక ఉత్తర్వును జారీ చేశారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

తనను తప్పు పట్టేవారిని.. విమర్శించే వారి విషయంలో తరచూ అసహనం ప్రదర్శించే ట్రంప్.. తాజాగా సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్.. ఫేస్ బుక్ లకు ఉండే చట్టపరమైన రక్షణల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఉత్తర్వును జారీ చేశారు. వినియోగదారుడు ఎవరైనా కావొచ్చు..వారు పోస్టు చేసే కంటెంట్ ను సోషల్ మీడియా సంస్థలు మార్చినా.. బ్లాక్ చేసినా.. వార్నింగ్ లేబుల్స్ లాంటివి పెట్టినా చర్యలు తప్పవని స్పస్టం చేశారు.

ఇంతకీ ఈ తీవ్రమైన నిర్ణయాన్ని ట్రంప్ ఎందుకు తీసుకున్నారన్న విషయంలోకి వెళితే.. ఓట్ బై మొయిల్ తో అధ్యక్ష ఎన్నికల్లో మోసాలు జరిగే అవకాశం ఉందంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ ఓట్ బై మొయిల్ అంటే ఏమిటంటారా? మన దగ్గర ఎన్నికల వేళలో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది కదా? అలాంటిదే ఇది కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు వేసేందుకు ప్రజలు రోడ్ల మీదకు వస్తే మాయదారి రోగం మరింత ముసురుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓట్ బై మొయిల్ పద్దతిలో ఓటు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఈ విధానంతో రిగ్గింగ్.. మోసం జరిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశారు.

అయితే.. ట్రంప్ చేసిన ట్వీట్ లో నిజానిజాలు తెలుసుకోవాలంటూ ట్విట్టర్ సంస్థ ట్రంప్ ట్వీట్ కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక లేబుల్ ను ఉంచింది. ఈ తరహాలో ఇటీవల ట్రంప్ వారి ట్వీట్లకు ట్విట్టర్ చేయటంతో.. ఆయనకు ఎక్కడో కాలిపోయింది. ప్రపంచాధినేతగా తనను తాను ఫీలయ్యే ట్రంప్ కు.. తానుచెప్పే మాటలో నిజాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలంటూ ఒక ప్రైవేటు సంస్థ తనకు చెప్పటం ఏమిటి? అన్నది కారణం కావొచ్చు. అందుకే.. రగిలిపోయిన ట్రంప్.. సోషల్ మీడియా మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లు ఉత్తర్వులు జారీ చేసి.. తాను మాటల మనిషినే కాదు.. చేతల మనిషిని కూడా అన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.

Next Story