కరోనా మీ భార్య లాంటిదే అన్న మినిస్టర్.. తర్వాత ఏమైందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 12:31 PM GMT
కరోనా మీ భార్య లాంటిదే అన్న మినిస్టర్.. తర్వాత ఏమైందంటే..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలకు చెందిన నేతలు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా ఉండేలా.. మహమ్మారితో పోరాడుదాం అంటూ కొందరు నేతలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ఉన్నారు. కానీ కొందరు మాత్రం కరోనా మీద చిల్లర జోక్స్ వేస్తూ వస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన ఓ మినిస్టర్ కరోనా మహమ్మారి మీ భార్యలాంటిదే అంటూ జోక్ వేశాడు. ఇక అంతే ఆయన్ను మహిళా సంఘాలు మామూలుగా దుమ్ము దులపడంలేదు.

ఇండోనేషియా సెక్యూరిటీ మినిస్టర్ ఎం.డి.మొహమ్మద్ మాఫుద్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక యూనివర్సిటీతో మాట్లాడుతూ ఆయన ఆడవాళ్ళను కరోనా మహమ్మారితో పోల్చాడు. కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలని అన్నారు మొహమ్మద్ మాఫుద్. ఒకరోజు ముందు తనకు ఓ మీమ్ వచ్చిందని అందులో 'కరోనా నీ భార్య లాంటిదేనని.. కరోనా ను నువ్వు కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉంటావని.. కానీ అది కుదరని పరిస్థితి అని.. భార్యతో కలిసి బ్రతకడాన్ని అలవాటు చేసుకున్నట్లే ఇది కూడా' అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం లేపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సెక్సీయెస్ట్ వ్యాఖ్యలు ఏమిటి అంటూ మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడమే కాకుండా.. ఇలాంటి జోక్స్ వేయడం ఏమిటి అని అంటున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొహమ్మద్ మాఫుద్ ఆఫీసు నుండి ఎటువంటి వివరణ కూడా ఇంకా రాలేదు.

ప్రపంచం లోనే అత్యధిక జనాభా కలిగిన నాలుగో దేశమైన ఇండోనేషియా.. ప్రజలు సామాజిక దూరం పాటించడానికి ఆర్మీని రంగంలోకి దించింది. 3,40,000 మంది సైన్యాన్ని దేశం మొత్తం మోహరించింది. ఇండోనేషియాలో 24000 కోవిద్ కేసులు నమోదయ్యాయి.. 1496 మరణాలు చోటు చేసుకున్నాయి. టెస్టింగ్ ల విషయంలో ఇండోనేషియా చాలా వెనుకబడిందని అంటున్నారు.

Next Story