ట్రంప్ మ‌రో సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2020 2:28 PM GMT
ట్రంప్ మ‌రో సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో షాక్ ఇచ్చాడు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. డ‌బ్ల్యూహెచ్‌వో(ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ) తో సంబంధాల‌ను పూర్తిగా తెంచుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. నిన్న అర్థ‌రాత్రి వైట్ హౌజ్‌లో ట్రంప్ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని తొలి నుంచీ ఆరోపిస్తున్న ట్రంప్.. మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు. వారి నిర్ల‌క్ష్యంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అపార ప్రాణ‌, ఆర్థిక న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని ఆరోపించారు. వైర‌స్ కీల‌క అంశాల‌ను దాచి పెట్టినందుకు చైనాపై కూడా ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు తెలిపారు.

చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని, సరిగ్గా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 400 మిలియన్ల డాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) వార్షిక సహకారాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్న‌ట్లు తెలిపారు. అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. త‌మ దేశ భ‌ద్ర‌త‌కు ముప్పుగా ప‌రిణ‌మించే చైనా పౌరుల‌ను ఇక‌పై అమెరికాలోకి అనుమ‌తించ‌బోమ‌ని తేల్చి చెప్పారు.

హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ స్పందించారు. హాంకాంగ్‌ ప్రజలకు ఇది తీరని విషాదం. కేవలం వారికి మాత్రమే కాదు చైనా ప్రజలకు చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇదో పెను విషాదమ‌న్నారు. అదే విధంగా హాంకాంగ్‌పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.

Next Story