చైనా వైరస్‌పై త్వరలోనే విజయం అంటూ ఆశలు రేకెత్తించిన ట్రంప్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 9:02 AM GMTకరోనా మహమ్మారికి వ్యాక్సిన్ల విషయంలో ఇప్పటికే చాలా దేశాధినేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. తమ దేశానికి సంబంధించిన ఫార్మా సంస్థల మీద ఇప్పటికే ఆయా దేశాల నాయకులు నమ్మకం పెట్టుకున్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల కారణంగా త్వరలోనే ప్రపంచానికి గుడ్ న్యూస్ వినపడవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచానికి కూడా వ్యాక్సిన్లను అందించే సత్తా అమెరికాకు ఉందని అన్నారు ట్రంప్.
చైనాలో పుట్టిన వైరస్ పై అమెరికా విజయం సాధించే రోజు దగ్గర్లోనే ఉందని, అతి త్వరలోనే ప్రపంచం శుభవార్తను వింటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నార్త్ కరోలినాలో పర్యటించిన ట్రంప్ కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థల పనితీరుపై పొగడ్తల వర్షం కురిపించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు కరోనాపై విజయం సాధించే దిశగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ముందున్న మొడెర్నా, ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించిందని.. ఈ వ్యాక్సిన్ భారీ ఎత్తున తయారవుతోందని అన్నారు. ఒకసారి దీనికి అనుమతి లభించగానే, అమెరికన్లందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అసలు తానంటే ఎవరికీ ఇష్టం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమ దేశ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫాసీ కంటే తనను ప్రజలు తక్కువగా ఇష్టపడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ఫాసీని తమ సర్కారే నియమించిందని, ఆయన ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. అమెరికాలో కరోనా కట్టడి కోసం ఫాసీతో పాటు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సూచనలనే తమ సర్కారు అమలు చేసిందని.. తనకే అధికంగా మద్దతు రావాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఫాసీకి వస్తోందని బాధపడ్డాడు ట్రంప్. తన సర్కారు కోసం పనిచేసే వ్యక్తికి ప్రజలు మద్దతు ఇస్తూ, తనను మాత్రం ఇష్టపడకపోవడానికి తన వ్యక్తత్వమే కారణమని అన్నారు.
అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల మందికి రెండేసి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తెలిపింది.
ఈ ఏడాది నవంబర్ నాటికే తమ వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం130 కోట్ల వ్యాక్సిన్ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్ ప్రణాళికలు వేసుకుంటోంది. మొడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశకు చేరుకుంది. 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. మొడెర్నా, ఫైజర్ సంస్థలు మొత్తం 30,000 మందిపై మానవ పరీక్షలను ఇప్పటికే ప్రారంభించాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఆ సంస్థకు అమెరికా ప్రభుత్వం రూ.7500 కోట్ల నిధులు సమకూర్చింది.