చైనాకు సరికొత్త ఆఫర్ ఇచ్చిన ట్రంప్..!

By సుభాష్  Published on  22 July 2020 10:24 AM GMT
చైనాకు సరికొత్త ఆఫర్ ఇచ్చిన ట్రంప్..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ వైరస్ ను సృష్టించింది చైనానే అని పలువురు ప్రపంచ దేశాల నేతలు ఆరోపించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు చైనాను నిందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చైనీస్ వైరస్' అంటూ ట్రంప్ నామకరణం కూడా చేయడం పెద్ద సంచలనమే అయింది. కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను వదిలే ప్రసక్తే లేదని కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ చైనాకు ఓ ఆఫర్ ఇచ్చారు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎవరితో అయినా పని చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. చైనాతో కూడా పని చేస్తామని.. అయితే చైనా మొదట కోవిద్ 19 వ్యాక్సిన్ ను కనిపెట్టాల్సి ఉంటుందని అన్నారు. మంచి ఫలితాలను తీసుకుని వచ్చే విధంగా ఎవరు పనిచేస్తున్నా కూడా వారితో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అమెరికాలో కూడా కరోనా వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ అనుకున్నదానికంటే ముందే వచ్చే అవకాశం ఉందని.. అమెరికా మిలిటరీ సమక్షంలో అందరికీ సరఫరా చేస్తామని కూడా అంటున్నారు ట్రంప్. కోవిడ్-19 టెస్టుల పరంగా అమెరికా అగ్రస్థానంలో నిలిచిందని.. ఇండియా రెండో స్థానంలో ఉందని చెప్పారు. తాము ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించగా...ఇండియా 1.2 కోట్లకు పైగా నిర్వహించిందని చెప్పారు.

ట్రంప్‌ విధానాల కారణంగానే చైనా దూకుడుగా ప్రవర్తిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ఆరోపించారు. విదేశీ వ్యవహారాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం తీరు అసంబద్ధంగా ఉందని.. సరిహద్దు విషయంలో భారత్‌ సహా ఇతర దేశాల పట్ల చైనా అనుసరిస్తున్న దుందుడుకు చర్యల పట్ల ట్రంప్‌ సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిలకడలేని విధానాల ఫలితంగా భారత్‌ సహా పొరుగుదేశాలపై చైనా ఇష్టం వచ్చినట్లు పని చేస్తోందని అన్నారు హిల్లరీ క్లింటన్.

Next Story