ట్రంప్ కృష్ణ హఠాన్మరణం..!
By న్యూస్‌మీటర్ తెలుగు
బుస్స కృష్ణ.. అలియాస్ ట్రంప్ కృష్ణ.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాములు దంపతుల కుమారుడైన ఇతడి గురించి చాలా మందికి తెలుసు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమానిగా బాగా ఫేమస్ అయ్యాడు. ఆఖరికి ట్రంప్ కు కూడా ఇతడి అభిమానం గురించి తెలిసింది. డొనాల్డ్ ట్రంప్ చిత్ర పటానికి పూజలు చేస్తూ బాగా ఫేమస్ అయిన ట్రంప్ కృష్ణ ఆదివారం హఠాన్మరణం చెందాడు. డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వచ్చినప్పటి నుంచి కృష్ణ తీవ్ర ఆవేదనలో మునిగిపోయాడని అందుకే మరణించాడని అంటున్నారు స్థానికులు.
డొనాల్డ్ ట్రంప్ అంటే కృష్ణకి చాలా అభిమానం. ట్రంప్ కు గుడి కట్టి పూజలు, అభిషేకాలు చేసేవాడు. స్థానికులు ట్రంప్ మీద ఉన్న అభిమానాన్ని చూసి ఏకంగా ట్రంప్ కృష్ణ అని పిలిచేవారు. డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వచ్చినప్పటి నుంచి బాధలో ఉన్న కృష్ణ హఠాన్మరణం చెందాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ట్రంప్ కు కరోనా సోకిందన్న వార్త విన్నాక అతడు ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదని.. మానసికంగా కుంగిపోయి కృష్ణ చనిపోయాడని అంటున్నారు.
2017 దీపావళి నాడు కృష్ణ తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి పూజలు చేసిన వీడియో వైరల్ అయింది.‘‘వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ నా ప్రాణస్నేహితుడు. క్రిష్ నా అభిమాని. అతను నా ఫొటో ల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తానని" అప్పట్లో ట్రంప్ ట్వీట్ కూడా చేశాడు. ఈ ఏడాది మార్చిలో ట్రంప్ భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన్ను కలిసేందుకు బుస్స కృష్ణ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ట్రంప్ ను కలవకుండానే కృష్ణ మరణించాడు. ట్రంప్ కరోనా నుండి కోలుకుని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాడు. తన వీరాభిమాని చనిపోయాడన్న విషయం ఎవరైనా చెప్పారో లేదో..!