బస్సును ఢీకొన్న రైలు.. 17మంది మృతి.. 29 మందికి గాయాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 9:27 AM GMT
బస్సును ఢీకొన్న రైలు.. 17మంది మృతి.. 29 మందికి గాయాలు

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జు అయ్యింది.

ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ భీతావహాక పరిస్థితులు ఉన్నాయి. బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందుకు బస్సులో ప్రయాణీకులు బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు తెలియరాలేదు.

థాయిలాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణ మైయ్యాయి. 2018 మార్చిలో ఈశాన్య థాయిలాండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా.. 12 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదకరమైన రహదారులు, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.

Next Story