డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు కరోనాతో మృతి
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) దెబ్బకి అగ్ర రాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికాలో సగటున రోజుకు 1500 మంది మరణిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు అమెరికాలో 22,020 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక న్యూయార్క్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క న్యూయార్క్‌లోనే 9,385 మరణాలు సంభవించాయి. ఆదివారం నాటికి అమెరికాలో 5,59,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. క్రౌన్ అక్వీసీషన్స్ పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. న్యూయార్క్ నగరంలో అనేక భారీ భవంతులను ఈ సంస్థ నిర్మించింది. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఆయన భారీగా విరాళాలు అందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు 4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే పరేడ్‌లోనూ స్టాన్లీని తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ పరిచయం చేశారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన మీడియా సమావేశంలో తన స్నేహితుడు కరోనా బారిన పడ్డారని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.