నేను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతా : డోనాల్డ్ ట్రంప్
By సుభాష్ Published on 19 Oct 2020 12:11 PM ISTమరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు డోనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం తప్పదని దాదాపు అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి జో బైడెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు అందుతున్న వేళ విస్కాన్సిస్లో జరిగిన ప్రచార సభలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనలు ట్రంప్ కు వ్యతిరేకంగా మారాయన్న సంగతి తెలిసిందే. వర్ణ వివక్ష, కరోనా కేసులు, మరణాలు, ఆర్థిక పరిస్థితి దిగజారడం, అశాంతి తదితరాలు బైడెన్ కు అనుకూలంగా మారిన వేళ, ‘నా పరిస్థితి అంత బాగాలేదు. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవకుంటే, ఏం చేస్తానో మీరు ఊహించగలరా? అమెరికాను విడిచి పెట్టి వెళ్లిపోతానేమో.. నాకు తెలియడం లేదు’ అని ట్రంప్ అన్నారు. బైడెన్ గెలిస్తే.. కరోనాకు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవుతుందన్నారు. ఇతర దేశాల్లోనే ముందుగా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. కావాలనే వైరస్ వ్యాప్తిని విస్తృతం చేస్తారని ఆరోపించారు. బైడెన్ గెలిస్తే, అమెరికా మూసివేత ఖాయమని, యూఎస్ ప్రజల జీవన విధానం నాశనం అవుతుందని, అందుకు బైడెన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తనను గెలిపించాలని కోరారు.