అప్పుడు ద్వేషించి‌న‌వారే ఇప్పుడు అభిమానిస్తున్నారు ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2020 2:40 PM GMT
అప్పుడు ద్వేషించి‌న‌వారే ఇప్పుడు అభిమానిస్తున్నారు ‌

టీఆర్ఎస్‌ ఆవిర్భావ దినోత్స‌వం(ఏప్రిల్ 27) సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ ఇండ్ల‌పైనే పార్టీ జెండాలు ఎగుర‌వేయాల‌ని తెరాస కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేటీఆర్ ర‌క్త‌దానం చేశారు. ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాన్ని వారం రోజులు నిర్వ‌హించాల‌ని కోరారు. అయితే.. కార్య‌క‌ర్త‌లంద‌రూ ర‌క్త‌దాన కార్య‌క్ర‌మంలో సామాజిక దూరాన్ని పాటించాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న వారి‌ని ఆదుకోవాల‌ని మంత్రి సూచించారు. 20 సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజల సేవకు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ పార్టీ దేశ రాజ‌కీయాల‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయిన‌ప్ప‌టికి ప‌రోక్షంగా ప్ర‌భావం చూపిస్తోంద‌న్నారు. టీఆర్ఎస్ ప్ర‌వేశ పెట్టే సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను కేంద్రం, వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పూర్ఫిగా తీసుకుంటున్నాయ‌న్నారు. భార‌త‌దేశ రాజ‌కీయ య‌వ‌నిక‌పై టీఆర్ఎస్ పార్టీ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని, కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా తో తన గమ్యాన్ని ముద్దాడిన పార్టీ దేశంలో టిఆర్ఎస్ పార్టీ ఒకటేన‌ని పేర్కొన్నారు. పార్టీ 20వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స్పూర్తినిచ్చిన ఫ్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్, విద్యాసాగ‌ర్ రావు ఇలాంటి ఎంద‌రో మ‌హానుభావుల‌ను గుర్తుంచుకుంటామ‌ని తెలిపారు. దేశంలో రెండు దశాబ్దాలపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చున‌ని, అందులో టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండటం సంతోషకర‌మ‌న్నారు. 60 లక్షల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా నిలిచింద‌న్నారు.

TRS Working President KTR

ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘ‌న‌త టీఆర్ఎస్‌కే ద‌క్కుతుంద‌న్నారు. హరితవిప్లవంతో పాటు క్షీర విప్లవం, పింక్ విప్లవం (మాంసం) నీలి విప్లవం (చేపలు), శ్వేత విప్లవం (పాలు) జల విప్లవం తెలంగాణలో ఆవిష్కృతమైంది. ఇక ప్రస్తుత సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొన్న‌ద‌ని, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకి ఆయన మీద ఉన్న విశ్వాసనికి ఇదే నిదర్శమ‌న్నారు. తెలంగాణ విభజన సందర్భంగా ద్వేషించిన లక్షలాది మంది ఇప్పుడు అభిమానిస్తున్నార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Next Story