కరోనా బారిన పడిన టీఆర్ఎస్ ఎంపీ రాములు
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Oct 2020 2:41 PM GMTభారత్లో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, హైదరాబాద్ మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
తాజాగా టీఆర్ఎస్ ఎంపీ పి. రాములు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,421 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001కి చేరింది. నిన్నకరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,221కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,07,326 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 20,337 యాక్టివ్ కేసులున్నాయి. ఇక హోం ఐసోలేషన్లో 17,214 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అత్యధికంగా జీహెచ్ఎంసీలో 249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.