2024లో అధికారంలోకి వస్తాం
By - Nellutla Kavitha | Published on 14 March 2022 3:47 PM GMT2024 లో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటం లో నిర్వహించిన జనసేన 9 వ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. 2014లో సూటిగా ప్రశ్నించాం, 2019లో బలంగా పోరాటం చేశామని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేనాని. మరోవైపు పొత్తులకు సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలు సరైన రూట్ మ్యాప్ ఇస్తారని భావిస్తున్నానని, పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి ప్రజా ప్రయోజనాల కోసం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. వైసీపీ ని గద్దె దింపి దిశగా కృషి చేయాలంటూ షణ్ముఖ వ్యూహాన్ని వివరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆరు అంశాలతో కూడినటువంటి జనసేన పార్టీ మానిఫెస్టో రిలీజ్ చేసినట్టుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసిపి వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తే లేదంటూ గట్టిగానే పొత్తులకు సంబంధించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు జనసేనాని.
ఇప్పటం లో గంటన్నర పాటు సాగిన పవన్ ప్రసంగంలో అభిమానులు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే, దానికి మరికొంత సమయం అంటూ చిరునవ్వుతో బదులిచ్చారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తారని నాకు చెప్పారు, నేను ఎదురు చూస్తున్నా, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా దించాలో చెప్పండి చేసి చూపిస్తాం అని గట్టిగానే వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అందర్నీ కలుపు పోతూనే, అందరి కోసం కలిసి పని చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఒకవైపు బీజేపీ గురించి మాట్లాడుతూనే, మరోవైపు పొత్తుల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు పవన్. దీంతో పాటుగా ప్రజల్లో బలపడానికి షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.