అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్
By - Nellutla Kavitha |
తెలంగాణ ఇంటర్నీడియట్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. జరుగబోయే క్లాసులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఈసారి పదో తరగతి పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ విద్యా సంవత్సరం కూడా ఆలస్యం కాబోతోంది. తెలంగాణాలో మే 20 నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.
ఇక వచ్చే విద్యా క్యాలెండర్ ప్రకారం జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు, పదిహేను రోజులు ఆలస్యంగా జూన్ 15 నుంచి సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అవుతాయి. 2022 - 23 విద్యాసంవత్సరంలో 221 పనిరోజుల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు, ఫిబ్రవరి 6 నుంచి 13 మధ్య ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనుంది బోర్డు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు బోర్డు పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 1 న కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయని బోర్డు ప్రకటించింది.