చంద్రబాబుకి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్.. విభజన చట్టం అంశాలపై కూడా..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  6 Jun 2024 4:19 PM IST
Telangana, cm revanth reddy, phone call,  Chandrababu,

చంద్రబాబుకి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్.. విభజన చట్టం అంశాలపై కూడా..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సహా పవన్ కల్యాణ్‌కు పలువురు ముఖ్య నాయకులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా టీడీపీ చీఫ్‌ చంద్రబాబుకి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు చంద్రబాబుతో సీఎం రేవంత్‌ పలు అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనీ సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అలాగే ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఉద్యోగుల పంపిణీ వంటివాటిని పరిష్కరించుకుందామని చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. టీడీపీ ఏకంగా 135 సీట్లు దక్కించుకుంది. ఇక జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 8 చోట్ల బీజేపీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలిచింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈనెల 12వ తేదీన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

గతంలో చంద్రబాబు పార్టీ టీడీపీలోనే రేవంత్‌రెడ్డి పని చేశారు. ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్‌రెడ్డికి చంద్రబాబు ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

Next Story