ఈవీఎంలతో ఏదో మాయ చేశారు: కాంగ్రెస్ పార్టీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్పును కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 4:03 PM GMTహర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్పును కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రజల అభీష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇంచార్జి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం అంతా ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరిపాము, నా ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపైనా, కనీసం మూడు జిల్లాల్లోని EVMల పనితీరుపై మేము ఫిర్యాదులను అందుకున్నామని తెలిపారు. సంబంధిత సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. హర్యానాలో ఫలితాలు పూర్తిగా ఊహించనివని, ఆశ్చర్యకరమైనవని అన్నారు. ఫలితాలు గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
పోల్ ప్యానెల్ వెబ్‌సైట్‌లో తాజా ట్రెండ్‌లను అప్‌లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ జైరాం రమేష్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. పోల్ ప్యానెల్ ప్రతిస్పందనగా, కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతా రహితమైనవి, నిరాధారమైనవని తెలిపింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తొలి ట్రెండ్‌లో ఆధిక్యం సంపాదించడంతో ఢిల్లీ, చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయాల్లో సంబరాలు జరిగాయి. అయితే బీజేపీ ఆ తర్వాత ఆధిక్యం సాధించింది.