నెల్లూరులో ప్రేమోన్మాదం - యువతిని కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య
By - Nellutla Kavitha | Published on 9 May 2022 6:20 PM ISTప్రేమోన్మాదం…తాను ప్రేమించిన అమ్మాయి తనకు కాకుంటే ఎవరికీ దక్కొద్దు, పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలి లేకుంటే ఎవరినీ చేసుకోవద్దు. కోపం, బాధ, అక్కసు…ఏదైనా ప్రేమ పేరుతో వేధింపులు, పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు, లేకుంటే దాడులు, హత్యలు, ఆపై ఆత్మహత్యలు. ఇదే ఉన్నాదం, విషాదం మరోసారి జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుందీ ప్రేమోన్మాదం.
పెళ్లి చేసుకుంటానని చెప్పినా తనకి అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే యువతిపై తుపాకీతో కాల్పులు జరిపాడు సురేష్ రెడ్డి అనే యువకుడు. కాల్పుల్లో గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఆ తర్వాత తనను తాను రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత మృతిచెందాడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో తుపాకీ కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నిమిషాల వ్వవధిలోనే ఇద్దరు మరణించడంతో కాల్పులు ఇద్దర్ని బలితీసుకోవడంతో ఏం జరిగిందో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు గ్రామస్థులు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లయిన సురేష్ రెడ్డి, కావ్య ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సురేష్‌రెడ్డి బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తుండగా, కావ్య పూణెలో పనిచేస్తున్నారు. అయితే, ఇద్దరూ ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ హోమ్‌లోనే ఉన్నారు. ఇద్దరి కులాలు కూడా ఒకటే కావడంతో, పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, కావ్యను సురేష్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో వారిని ఒప్పించడానికి సురేష్ రెడ్డి ఎంతగానో ప్రయత్నించినట్టుగా సమాచారం. ప్రేమ వ్యవహారం తెలియని కావ్య పేరెంట్స్ అంగీకరించకపోవడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్‌రెడ్డి ఈరోజు కావ్య పేరేంట్స్ తో మరోసారి మాట్లాడేందుకు తాటిపర్తికి వెళ్లాడు. తన వెంట తుపాకీని కూడా తీసుకొని వెళ్లాడు. కావ్య పేరేంట్స్ తో గొడవపడ్డ సురేష్ రెడ్డి ఆవేశంతో కావ్యపై కాల్పులు జరిపి, కాస్త దూరం వెళ్లి తనను తాను కూడా కాల్చుకున్నాడు. అయితే సురేష్ కు ఎక్కడి నుంచి తుపాకి వచ్చింది, ఎవరైనా సహకరించారా అనేదానిపై విచారణ చేపట్టారు పోలీసులు.