చల్లబడిన హైదరాబాద్ - వేడి గాలుల నుంచి రిలీఫ్
By - Nellutla Kavitha |
భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. మండిపోతున్న ఎండలకుతోడు, ఉక్కపోతతో తెలంగాణవాసులు అల్లాడుతున్నారు. దీనికితోడు ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయినప్పటికీ వరుణుడు కరుణించాడు. సాయంత్రం నగరంతోపాటుగా, శివారుప్రాంతవాసులను పలకరించాడు వానదేవుడు.
దీంతో ఒక్కసారిగా చల్లబడిందీ వాతావరణం. ఈదురుగాలులతో కూడిన చల్లని వర్షం కురవడంతో పులకరించిపోయారు ప్రజలు. బేగంపేట్, అమీర్ పైట్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, రామాంతరూర్, ఉప్పల్ లో వాన పడింది. మరోవైపు నేరేడ్మెట్, కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ, కీసరతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. సాయంత్రం పూట వర్షం కురియడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. అయినప్పటికీ ఎండవేడిమి నుంచి చల్లని గాలుల రూపంలో ఉపశమనం కలగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు.
మరోవైపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు వడగాలులు వీస్తే, మరికొన్ని జిల్లాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.