మండుతున్న ఎండలకు కాస్త విరామం - రెయిన్ అలర్ట్
By - Nellutla Kavitha |
హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులతో పాటుగా, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దు అంటూ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపధ్యంలోనే ఒంటిపూట బడుల సమయాన్ని కూడా ఉదయం పదకొండున్నర గంటలకు వరకే కుదించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు హైదరాబాద్ వాతావరణ కేంద్ర ఒక చల్లని వార్త అందిస్తోంది. మండుతున్న ఎండల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ కేంద్రం సందేశం ఇచ్చింది. దీంతోపాటే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ సహా 17 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ 17 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరాట్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాలు మేఘావృతం అవ్వడంతో, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.