రెండు హిందూస్థాన్ లను కోరుకుంటున్న మోది
By - Nellutla Kavitha | Published on 16 May 2022 6:50 PM ISTదేశ ప్రజలను రెండుగా విభజించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. రెండు హిందుస్థాన్ లు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి మోడీ కోరుకుంటున్నారని, ఒకదాన్ని ధనికుల కోసం అయితే, మరొకటి పేదలకోసం అని అన్నారు రాహుల్ గాంధీ. ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తలు కోసం ఒక హిందుస్థాన్ అయితే, దళితులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల కోసం మరో హిందుస్థాన్ ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని రాహుల్గాంధీ అన్నారు.
రాజస్థాన్ లోని బన్సా్వారా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్గాంధీ, ప్రజలను రెండుగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను యుపిఎ ప్రభుత్వం బలోపేతం చేస్తే, బిజెపి ప్రభుత్వం మాత్రం దాన్ని పూర్తిగా బలహీనపరిచిందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తామని, ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమన్నారు రాహుల్. ప్రజలతో మమేకం అయ్యేందుకు తాము పని చేస్తుంటే బీజేపీ మాత్రం అదే ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
హిందుస్థాన్ ధనిక, పేద దేశాలుగా మారిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు భిన్నమైన భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందని, నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థకు హాని చేసేలా పని చేస్తున్నారని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ.